కొండమల్లేపల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
విజేతలకు బహుమతుల ప్రదానం
కొండమల్లేపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను కొండమల్లేపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు కొండమల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఊరె జనార్దన్, ప్రధాన కార్యదర్శి దాచేపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి కొత్త వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు బురుగు శివ, కార్యదర్శి సముద్రాల అజయ్, కోశాధికారి కామిశెట్టి వంశీ, ఉపాధ్యక్షుడు బండారు నాగరాజు విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, ఐక్యత, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు మహిళల్లో ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు.
బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు సంప్రదాయ పాటలు, ఆటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేయడంతో కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.