ప్రపంచ టాప్ శాస్త్రవేత్తల జాబితాలో గుడ్లూరు డాక్టర్
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
వరుసగా మూడో ఏడాది గుర్తింపు పొందిన డాక్టర్ సూరపరాజు సుబ్బరామ కౌశిక్
గుడ్లూరు, ప్రకాశం జిల్లా: అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన డాక్టర్ సూరపరాజు సుబ్బరామ కౌశిక్ వరుసగా మూడో ఏడాది స్థానం సంపాదించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో ఆయన స్వగ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది.
కౌశిక్ తల్లిదండ్రులు నాగేంద్ర ప్రసాదరావు, పద్మావతి. ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న కారుణ్య ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ (రీసెర్చ్)గా ఆయన పనిచేస్తున్నారు.
సౌర ఉష్ణశక్తి వ్యవస్థలు, ఉష్ణశక్తి నిల్వ, ఫేజ్ చేంజ్ మెటీరియల్స్, బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్ వంటి కీలక రంగాల్లో కౌశిక్ పరిశోధనలు చేస్తున్నారు. ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, శక్తి నిల్వ సాంకేతికతలను అభివృద్ధి చేయడం వంటి అంశాల్లో ఆయన పరిశోధనలకు ప్రాధాన్యం ఉంది.
ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా మూడో ఏడాది చోటు దక్కించుకోవడంపై కౌశిక్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, మిత్రులు అభినందించారు. ఆయన సాధించిన ఈ గుర్తింపు గుడ్లూరు గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.