ఎన్ఐటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటా
ఎన్ఐటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటా: దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్, Ntoday News: ఎన్ఐటీలో పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల విధుల నుంచి తొలగించడంతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
గత పదేళ్లుగా ఎన్ఐటీలోని వివిధ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన తమను ఇటీవల ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడంతో కుటుంబాలపై ఆర్థిక భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఎన్ఐటీ అధికారులతో పాటు ప్రభుత్వ స్థాయిలో సమస్యను ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని వారు దాస్యం వినయ్ భాస్కర్‌ను కోరారు.
ఉద్యోగుల సమస్యలను విన్న దాస్యం వినయ్ భాస్కర్.. వారి సమస్యలను ఎన్ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చించి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఏళ్ల తరబడి ఒకే సంస్థలో పనిచేసిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం వల్ల వారి కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. పదేళ్లుగా సేవలందించిన ఉద్యోగుల అనుభవం, వారి కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యోగుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా సమస్యకు న్యాయబద్ధమైన పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ లీగల్ సెల్ అడ్వైజర్ నాయిని రవి, బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.