ఏపీకి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు..
ఏపీకి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.1 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం నవంబర్ తేదీల్లో విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2024 జూన్ నుంచి రాష్ట్రానికి రూ.22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, వీటి ద్వారా 7.1 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు, పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయడం, పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచడం ద్వారా పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన పరిస్థితులు కల్పించనున్నట్లు వివరించారు. విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడంతో పాటు, వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడుల ప్రతిపాదనలు వాస్తవ ప్రాజెక్టులుగా మారితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.