అమెరికాకు ఇరాన్ కీలక ప్రతిపాదన..
అమెరికాకు ఇరాన్ కీలక ప్రతిపాదన.. ఏడు రోజుల్లో హర్ముజ్ జలసంధి తెరిచేందుకు సిద్ధం
సెప్టెంబర్ 23: ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా తన సైనిక ఒత్తిడిని తగ్గించి, నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ తెలిపింది.
ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన క్యోడో న్యూస్‌కు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి పంపినట్లు ఆ అధికారి పేర్కొన్నట్లు తెలిసింది. హర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న సైనిక చర్యలను అమెరికా నిలిపివేయడంతో పాటు నౌకా దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్ కోరుతున్నట్లు సమాచారం.
అంతేకాకుండా సమస్యను సైనిక మార్గంలో కాకుండా దౌత్యపరంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధికారికంగా ప్రకటించాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ షరతులకు అంగీకరిస్తే ఏడు రోజుల్లో జలసంధిని తెరిచి, ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శత్రుత్వానికి శాశ్వత ముగింపు పలికే దిశగా చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ తెలిపినట్లు సమాచారం.
ఈ ప్రతిపాదనకు ఇరాన్ అత్యున్నత నాయకత్వం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు క్యోడో న్యూస్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలతో ఇరాన్ ప్రతినిధులు ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాకు కీలకమైన సముద్ర మార్గం కావడంతో, దాని కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడం అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే అంశంగా మారింది. అయితే ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనపై అమెరికా నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.