లడ్డూ సొంతం చేసుకున్న కొమిడాల మహేందర్ రెడ్డి
NTODAY NEWS : చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 6వ వార్డు వెంకటాపురం గ్రామంలో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలం పాటలో కొమిడాల మహేందర్ రెడ్డి రూ.35,816లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లడ్డూ దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. గణనాథుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలు ఐక్యతతో ఇలాంటి ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం హనుమాన్ యువసేన సభ్యులు మహేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.