నకిరేకల్‌కు చేరిన కృష్ణా జలాలు
ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవతో చెరువులు, కుంటలకు నీరు
NTODAY NEWS : నకిరేకల్
ఎల్‌నినో ప్రభావంతో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవతో నకిరేకల్ పట్టణానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. పట్టణ తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో నకిరేకల్ పెద్ద చెరువు, కాలం వారి కుంట, ఎర్రకుంటలను కృష్ణా జలాలతో నింపేందుకు చర్యలు చేపట్టారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో నకిరేకల్‌కు కృష్ణా జలాలు చేరుకోవడంతో పట్టణ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కృష్ణా జలాలకు కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. చెరువులు, కుంటల్లోకి కృష్ణా జలాలు చేరడం వల్ల భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా వ్యవసాయానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాగునీటి కొరతను తగ్గించేందుకు ఈ చర్య దోహదపడుతుందని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో పట్టణానికి కృష్ణా జలాలు తీసుకురావడంలో చొరవ చూపిన ఎమ్మెల్యే వేముల వీరేశానికి పట్టణ ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.