లేబర్ కోడ్స్‌తో కార్మికుల హక్కులకు ముప్పు
లేబర్ కోడ్స్‌తో కార్మికుల హక్కులకు ముప్పు
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. శనివారం చిట్యాల మండల కేంద్రంలోని మేకల లింగయ్య స్మారక భవనంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిట్ట నగేష్ మాట్లాడుతూ.. కార్మికుల రోజువారీ పని దినాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచేలా లేబర్ కోడ్స్‌లో నిబంధనలు ఉన్నాయని, ఇవి యాజమాన్యాలకు అనుకూలంగా, కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు నిర్వహిస్తున్న పోరాటాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 10న నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల లింగస్వామి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపురేఖలను మార్చడంతో పాటు నిధుల కేటాయింపులో కోత విధించారని ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో చేతివృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఐతరాజు నర్సింహా, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కోనేటి రాములు, ఐతరాజు నర్సింహా, సీఐటీయూ మండల నాయకులు పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, పాలమాకుల అర్జున్, కల్లూరి కుమారస్వామి, పెర్కా శంకరయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.