జర్నలిస్టు రామన్న నాయక్‌పై దాడిని ఖండించిన లంబాడి హక్కుల పోరాట సమితి
దాడికి పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలి: తేజావత్ వాసు నాయక్
మహబూబాబాద్, అక్టోబర్ 28 | ఎన్ టుడే న్యూస్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన జర్నలిస్టు బానోతు రామన్న నాయక్‌పై జరిగిన దాడిని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తేజావత్ వాసు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. జనంసాక్షి దినపత్రికలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న రామన్న నాయక్‌పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆయన బైక్‌ను అడ్డగించి, బీరు సీసాలు, ఇనుప వస్తువులు, కత్తులతో దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు.
రామన్న నాయక్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారుడిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన ఎదుగుదలను ఓర్వలేక కొందరు కక్షపూరితంగా దాడి చేయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక మరికొందరి ప్రమేయం కూడా ఉండవచ్చని పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని వాసు నాయక్ ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్నవారిని గుర్తించి అరెస్టు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భూక్యా జగన్ నాయక్‌తో పాటు ఖీరియా నాయక్, భోజ్యా నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.