తిరువూరులో భూ వివాదం.. న్యాయం కోసం దంపతుల వేడుకోలు
తిరువూరులో భూ వివాదం.. న్యాయం చేయాలని దంపతుల వేడుకోలు భూమిని 2022లో కొనుగోలు చేశాం.. రిజిస్ట్రేషన్ పత్రాలు మా వద్ద ఉన్నాయి చిలవరపు హేమలత కుటుంబంపై ధనికొండ అప్పారావు దంపతుల ఆరోపణలు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని శాంతినగర్‌లో భూ వివాదం తలెత్తింది. తాము కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని నరసాపురం గ్రామానికి చెందిన ధనికొండ అప్పారావు దంపతులు ఆరోపించారు. ఈ మేరకు భూమికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు చూపిస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు.
తిరువూరు పట్టణంలోని శాంతినగర్‌లో సర్వే నంబర్ 202/1బి 17 పరిధిలో ఉన్న ఏడు సెంట్ల భూమిని 2022లో ఆలపాటి శ్రీనివాసరావు వద్ద కొనుగోలు చేసినట్లు అప్పారావు దంపతులు తెలిపారు. భూమికి సంబంధించి లింకు డాక్యుమెంట్‌తో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగేళ్ల అనంతరం చిలవరపు హేమలత కుటుంబ సభ్యులు ఆ భూమి తమదంటూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
భూమికి సంబంధించి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తమ స్థలంలో రేకుల షెడ్డు నిర్మించుకునే సమయంలో ఫెన్సింగ్ తొలగించి పనులను అడ్డుకున్నారని దంపతులు వాపోయారు. తమను అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై అవతలి పక్షం వివరణ తెలియాల్సి ఉంది.
తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన తాము రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని, రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రూపాయి రూపాయి కూడబెట్టి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశామని అప్పారావు దంపతులు తెలిపారు. తమ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని పోలీసులను కోరారు.
భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే తమ కుటుంబం తీవ్ర నిరాశలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.