నిర్మల్‌లో వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ శాఖ ఆకస్మిక తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘించిన రెండు సంస్థలపై కేసులు నమోదు
నిర్మల్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
నిర్మల్ పట్టణంలోని పలు వ్యాపార సంస్థలపై తూనికలు, కొలతల లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన రెండు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి. శంకర్ తెలిపారు.
తూనిక పరికరాలకు తప్పనిసరిగా స్టాంపింగ్
ఈ సందర్భంగా పి. శంకర్ మాట్లాడుతూ పట్టణంలోని వ్యాపారులందరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. వ్యాపార సంస్థల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు, కాంటాలు, బాట్లు, ఇతర తూనిక పరికరాలకు నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా స్టాంపింగ్ చేయించుకోవాలని స్పష్టం చేశారు.
ప్యాకింగ్ లైసెన్స్ తప్పనిసరి
వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా ప్యాకింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించారు. వినియోగదారులకు సరైన తూనికలు, కొలతలతో వస్తువులు అందించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి వ్యాపారి లీగల్ మెట్రాలజీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పి. శంకర్ సూచించారు.