ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రు నాయక్ పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 5 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రు నాయక్ పిలుపునిచ్చారు.
బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో సోమవారం తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి డా. రామచంద్రు నాయక్ నంగారా ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్‌తో పాటు భూక్యా వీరభద్రం, ఎం. బాలు నాయక్, వాంక్డోత్ వీరన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. రామచంద్రు నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 10న ఉదయం 11.30 గంటలకు పలక్‌నామా ప్రాంతంలోని రవీందర్ నాయక్ నగర్‌లో ఉన్న లింబ్రా హోటల్ నుంచి కళా ప్రదర్శన ప్రారంభమవుతుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కళాకారులు పాల్గొని ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని నంగారా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పోరాడి అమరుడైన గిరిజన యోధుడు ఠానూ నాయక్ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహించడం సంతోషకరమని అన్నారు.
మారుతున్న జీవన విధానాల కారణంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల కళలు, ఆచారాలు, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని డా. రామచంద్రు నాయక్ పేర్కొన్నారు.