పెద్దకాపర్తిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
చిట్యాల, ఎన్‌టుడే న్యూస్: అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రక్త నిల్వలను పెంచి, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని రామన్నపేట లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ కేవీ ప్రసాద్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.
పెద్దకాపర్తి గ్రామంలో రామన్నపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా రక్తదాన శిబిరం, ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని కేవీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ భాస్కర్‌రావు పనకంటి, కార్యదర్శి లయన్ మహమ్మద్ ఉస్మాన్, కోశాధికారి లయన్ నరేందర్‌రెడ్డి గంట్ల మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్, మలక్‌పేట వారి సహకారంతో గ్రామస్థులకు ఉచితంగా పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
శిబిరంలో షుగర్, ర్యాండమ్ షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యులు డాక్టర్ రవితేజ, రేవంత్, దుర్గశ్రీ, నిహారికలు గ్రామస్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు.
అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా ఐ డొనేషన్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, టెక్నీషియన్ జానీ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కల్పించారు. నేత్రదానం ప్రాధాన్యతను వివరించేందుకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో రీజినల్ చైర్‌పర్సన్ లయన్ సంజీవరెడ్డి సిరిగిరెడ్డి, లయన్ యాదమ్మ, చార్టర్ ప్రెసిడెంట్ లయన్ కృష్ణారెడ్డి యపాల, లయన్ మర్రి గోపాల్‌రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, కాకులరపు బొర్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, మాజీ సర్పంచులు కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, మర్రి జలందర్‌రెడ్డి, ఓర్సు సైదులు, నీలకంఠం లింగస్వామి, ఏర్పుల నర్సింహ, ఆనగంటి నరేష్, మర్రి హరీష్, ఏర్పుల వెంకటేష్, యాదయ్య, ఎదుళ్ల అజిత్‌రెడ్డి, కామినేని దుర్గకుమార్, నరేష్, లవకుమార్, రాకేష్, శంకర్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.