మధిర 22వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకస్మిక పర్యటన
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిశీలన – వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
మధిర: మధిర పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. వార్డులో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కె. శామ్యూల్ పాల్‌తో పాటు మున్సిపాలిటీకి చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా వార్డులో డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ తదితర సమస్యలపై కౌన్సిలర్ దారా నాగార్జునను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మార్కెట్ ప్రాంతంలో నల్లాల ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని గుర్తించిన చైర్‌పర్సన్ వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
దెబ్బతిన్న డ్రైనేజీల్లో పూడికతీత పనులను తక్షణమే చేపట్టాలని, మురుగు నిల్వల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల బెడద నివారణకు వార్డులో క్రమం తప్పకుండా ఫాగింగ్‌తో పాటు దోమల మందు పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
అలాగే వార్డులో ఎక్కడెక్కడ వీధి దీపాలు వెలగడం లేదో గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాజీ లేకుండా పనిచేయాలని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ సూచించారు. పర్యటనలో మున్సిపల్ వివిధ శాఖల అధికారులు, డివిజన్ అధ్యక్షుడు రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.