అక్టోబర్ 2న No UPI Day నిరసన విరమణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించడాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ప్రకటించిన ‘No UPI Day’ నిరసనను ట్రేడర్స్, బిజినెస్ అసోసియేషన్లు విరమించుకున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుధవారం జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు వెల్లడించినట్లు సమాచారం.
యూపీఐ లావాదేవీలకు సంబంధించి చార్జీల పరిమితిని ప్రస్తుత రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, అలాగే మర్చంట్-టు-మర్చంట్ (వ్యాపారి నుంచి వ్యాపారికి) లావాదేవీలను MDR పరిధి నుంచి మినహాయించాలని వ్యాపార సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు.
తమ డిమాండ్లపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వ్యాపార సంఘాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న నిర్వహించనున్న ‘No UPI Day’ నిరసనను విరమించుకుంటున్నట్లు వెల్లడించాయి.
యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు నిర్వహించే చిన్న వ్యాపారులు, రిటైలర్లు ఎదుర్కొంటున్న చార్జీల అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మరిన్ని చర్చలు జరిపే అవకాశం ఉందని వ్యాపార సంఘాల ప్రతినిధులు తెలిపారు.