బాలుడు రామయ్యను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు
ఆంధ్రప్రదేశ్
/
నెల్లూరు
నెల్లూరు: సోషల్ మీడియాలో వైరల్ అయిన గొర్రెల కాపరి బాలుడు రామయ్యను అధికారులు సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టి బాలుడి ఆచూకీ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
రామయ్యను సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు వేగంగా స్పందించినట్లు సమాచారం. బాలుడు తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రామయ్య కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు తండ్రికి వైద్యం, తల్లికి స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
రామయ్య ఆచూకీ కోసం తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వేదికగా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలతో బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి విద్య కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.