స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి: జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా
కనిగిరి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం ఆయన కనిగిరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, ఎన్నికలకు సంబంధించిన రికార్డులు, శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగానే సేకరించి సిద్ధంగా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల భవనాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర వివరాలను నమోదు చేయాలని తెలిపారు.
గత ఎన్నికల్లో ఘర్షణలు, వివాదాలు చోటుచేసుకున్న గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
రౌడీషీటర్లు, పాత నేరస్తులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. అవసరమైన చోట కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు చట్టప్రకారం బైండోవర్ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పేర్కొన్నారు.