ఎమ్మెల్యే పై పవన్ కళ్యాణ్ సీరియస్
ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ సీరియస్.. చిర్రి బాలరాజుపై విచారణకు హై లెవల్ కమిటీ, రిపోర్ట్ ఆధారంగా చర్యలు
సొంత పార్టీ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల విషయంలో జనసేనాని సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే చిర్ర బాలరాజు వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక హైలెవెల్ కమిటీని నియమిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఆరోపణలపై వాస్తవాలను వెలికితీయాలని, లోతుగా దర్యాప్తు చేయాలని ఆ కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆయనపై చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
చిర్రి బాలరాజుపై వచ్చిన ఆరోపణలు ఏమిటి?
ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అనేక ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కొయ్యలగూడెం పరిసరాల్లో మట్టి, ఇసుక తవ్వకాల వాటాల పంపకాలపై రూ.20 లక్షలు, రూ.30 లక్షల డబ్బు సెటిల్‌మెంట్లకు సంబంధించి ఆయన మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్పింగులు బయటకు రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి అక్రమ దందాల్లో భాగస్వామి కావడం పార్టీ అధిష్ఠానాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. వీటికి తోడు నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యంపై విమర్శలున్నాయి. పార్టీ నాయకుడిపై ఎమ్మెల్యే భార్య దాడి చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి.
అలాగే సీనియర్ నేతలు, అసలైన జన సైనికులను పక్కనపెట్టడంపై కూడా చిర్ర బాలరాజుపై మంగళగిరి పార్టీ కార్యాలయానికి వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. గతంలోనే పవన్ కల్యాణ్ స్వయంగా బాలరాజును అమరావతికి పిలిపించి ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి నెల రోజుల గడువు ఇచ్చినట్టు సమాచారం. కానీ ఆయన తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం వల్లే జనసేనాని సీరియస్ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కమిటీ రిపోర్ట్ అనంతరం కఠిన చర్యలు...
పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ క్షేత్రస్థాయిలో లోతైన దర్యాప్తు జరిపి, వాస్తవాలతో కూడిన రిపోర్ట్ అందించనుంది. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పార్టీ వెల్లడించింది. దీంతో బాలరాజు పొలిటికల్ ఫ్యూచర్‌పై ఉత్కంఠ నెలకొంది. ఏదిఏమైనా ఈ చర్యతో తన వాళ్లైనా సరే తప్పు చేస్తే ఊరుకునేది లేదనే సంకేతాలను పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టైంది.