చాట్రాయి సెంటర్‌లో చెత్త కుప్పలు.. పట్టించుకోని అధికారులు!
చాట్రాయి సెంటర్‌లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే.. పట్టించుకోని అధికారులు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం.. పారిశుధ్యంపై ప్రజల ఆవేదన ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్‌లో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. సెంటర్‌లో ఏ దుకాణం ముందు చూసినా చెత్త దర్శనమిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, చెత్త సేకరణ వాహనాన్ని పంపించి శుభ్రం చేయించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తూ పోతుంటారు. అలాంటి ప్రధాన కూడలిలోనే పారిశుధ్యం ఇంత అధ్వానంగా ఉంటే, గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల ముందు పేరుకుపోతున్న చెత్తతో దుర్వాసన వ్యాపించడమే కాకుండా, దోమలు, ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశమైనప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చాట్రాయి సెంటర్‌లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని, క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచి, వ్యాధులు వ్యాపించే పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.