పీఎం సూర్య ఘర్ పథకం రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్‌ఈ ఆనంద్
వరంగల్: ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్య ఘర్ పథకం రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ వరంగల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ) ఆనంద్ సూచించారు.
ఈ పథకం కింద గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుపై సామర్థ్యాన్ని బట్టి సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఒక కిలోవాట్ సోలార్ వ్యవస్థకు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థలకు గరిష్ఠంగా రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న గృహ వినియోగదారులు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ pmsuryaghar.gov.inను సందర్శించాలని ఎస్‌ఈ ఆనంద్ కోరారు.