ఆరోగ్యకరమైన పంటలే లక్ష్యంగా పొలంబడి శిక్షణ
ఆరోగ్యకరమైన పంటలు ఈ లక్ష్యంగా పొలంబడి కార్యక్రమంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం సుంకనపల్లి గ్రామంలో రైతు ఆవుల ఐలయ్య పొలంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పథకం ఆధ్వర్యంలో పొలంబడి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కంపసాగర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బి. అనిల్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు వరి సాగులో ఆరోగ్యకరమైన పంట, అధిక దిగుబడుల సాధనకు పాటించాల్సిన మెలకువలను వివరించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి వర్మీకంపోస్టు, పశువుల పేడ, గోమూత్ర ఆధారిత ద్రావణాలు వంటి సేంద్రియ పదార్థాలను వినియోగించాలని సూచించారు. వరి సాగుకు ముందు జనుము, జీలుగు వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయడంతో పాటు అనంతరం అపరాల పంటలను పండించడం ద్వారా నేల సారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను పాటించి ఆరోగ్యకరమైన పంటలను పండించాలని సూచించారు. సుంకనపల్లి సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య మాట్లాడుతూ గ్రామంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు మాట్లాడుతూ సహజ వ్యవసాయం చేపట్టే రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సహజ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించే బుక్లెట్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నవీన్‌తో పాటు రైతులు గోపగోని కృష్ణయ్య, ఎర్రగోని వెంకటేష్, దేవనబోయిన రవి, బాతరాజు ముత్యాలు, భీమిడి నర్సిరెడ్డి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.