చింతలపూడిలో ఎన్నికల నిబంధనలపై పోలీసుల కఠిన హెచ్చరికలు
144 సెక్షన్ అమలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు
పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ కార్యకలాపాలకు తావులేదు.. ఓటర్లను ప్రభావితం చేస్తే చర్యలు తప్పవు
ఏలూరు జిల్లా, చింతలపూడి: ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గ పరిధిలో పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల పరిధిలో ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు లేదా ఇతర వ్యక్తులు పార్టీ గుర్తులతో ప్రచారం చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం, ప్రభావితం చేసే విధంగా వ్యవహరించడం పూర్తిగా నిషేధమని పోలీసులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫోన్లు వినియోగించడం, ఎస్సెమ్మెస్‌లు పంపడం, పోలింగ్ ప్రక్రియను ఫొటోలు లేదా వీడియోలు తీయడం నిషేధమని పేర్కొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోపల, వెలుపల టెంట్లు ఏర్పాటు చేయడం, కుర్చీలు వేయడం, ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడం వంటి కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓటర్లు మినహా ఇతరులు ఎన్నికల అధికారుల ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించరాదని సూచించారు. అలాగే ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా ఓటర్లను ఆటోలు, బస్సులు లేదా ఇతర వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించరాదని హెచ్చరించారు. ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఇంటి సభ్యులు మినహా ఇతర వ్యక్తులకు ఆశ్రయం కల్పించరాదని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా వ్యవహరించినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించారు.