మట్టి గణపతుల నిర్వాహకులకు బహుమతుల ప్రదానం
హనుమకొండ: వరంగల్ మహానగర గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఉత్తమ మట్టి గణపతుల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ శ్వేత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి గణపతులను ప్రతిష్ఠించిన మండపాల నిర్వాహకులను ఎమ్మెల్యే, పోలీస్ కమిషనర్ అభినందించారు. ఉత్తమ మట్టి గణపతుల విభాగంలో మడికొండ కింగ్ స్టార్ యూత్ అసోసియేషన్‌కు మొదటి బహుమతి, వరంగల్ రాంకీ విలాస్ గజానన మండలికి రెండో బహుమతి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో నిర్వహించనున్న గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సమన్వయంతో నిర్వహించుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు నిర్ణయించిన సమయానికి నిమజ్జనానికి బయలుదేరి, పోలీస్ శాఖ సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.
నిమజ్జన ప్రక్రియ సకాలంలో పూర్తయ్యేలా మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని తెలిపారు. భక్తులు, యువత క్రమశిక్షణ పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ముగించాలని సూచించారు.