ఆన్‌లైన్‌లో భూమి నమోదు కాకపోవడంతో ఇబ్బందులు.. ఆక్రమణలపై రైతు ఆవేదన
ప్రభుత్వం ఇచ్చిన భూమిలో చెట్ల నరికివేత, మొరం తవ్వకం, మొక్కలకు నిప్పు పెట్టారని ఆరోపణ
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఫతేపూర్ (ఎన్ టుడే న్యూస్):
ఆన్‌లైన్‌లో భూమి వివరాలు నమోదు కాకపోవడంతో తన భూమిలోకి ఇతరులు అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫతేపూర్ గ్రామానికి చెందిన ఓ చిన్న రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో చెట్లను నరకడం, మొరం తవ్వడం, మొక్కలకు నిప్పు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఫతేపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 50/1లో తనకు కేటాయించినట్లు చెబుతున్న రెండు ఎకరాల భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని రైతు తెలిపారు. ఈ కారణంగా భూమి విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తాను పెంచుకుంటున్న చెట్లను కొంతమంది వ్యక్తులు పాడుచేస్తున్నారని ఆరోపించారు.
భూమిలోని చెట్లు, మొక్కలు ధ్వంసం కావడంతో తీవ్ర నష్టం జరుగుతోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి భూమి వివరాలను పరిశీలించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు తన భూమికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.