ఇందిరా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి
చిత్తపూరులో సీసీ రోడ్డు నిర్మించాలి ఇందిరా కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలోని ఇందిరా కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు చాట్ల బాబురావు డిమాండ్ చేశారు.
ఎస్సీ కాలనీలో నిర్మించాల్సిన సీసీ రోడ్ల పనులు చేపట్టకుండా అధికారులు వివక్ష చూపుతున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. సరైన రహదారులు లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ సౌకర్యం కూడా లేకపోవడంతో వర్షాలు అధికంగా కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని, దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అధికారులు వెంటనే స్పందించి ఇందిరా కాలనీలో సీసీ రోడ్లు నిర్మించడంతోపాటు డ్రైనేజీ సౌకర్యం కల్పించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ సమస్యలపై గ్రామంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం గ్రామ సచివాలయంలో వినతిపత్రం సమర్పించినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.