సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి: వేముల బక్కయ్య
గుళ్లపూడిలో కరపత్రాల పంపిణీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నేతల విమర్శలు
ముసునూరు: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ అనుబంధ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలు నవంబర్ 21, 22 తేదీల్లో ఝార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడిలో నిర్వహించనున్నట్లు మండల కార్యదర్శి వేముల బక్కయ్య తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ గుళ్లపూడి గ్రామంలో కిసాన్ మహాసభ మండల అధ్యక్షుడు పామర్తి రామారావు అధ్యక్షతన కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేముల బక్కయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులు, రైతులు, కూలీల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తక్షణమే సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని, వి.బి. గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా కొనసాగించాలని కోరారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి 200 రోజుల పని కల్పించి రోజువారీ కూలీని రూ.700కు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేసి నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించాలని అన్నారు.
అటవీ భూములకు సంబంధించి నాలుగో నోటిఫికేషన్ను రద్దు చేయాలని, సాగు చేస్తున్న అర్హులైన రైతులకు భూములపై హక్కులు కల్పించాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు రైతు భరోసా అందించి బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ముసునూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేయాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని, రోజువారీ కూలీలకు నిత్యావసర సరుకులను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పోరంబోకు, అటవీ, కొండపోడు మిగులు భూములకు హక్కులు కల్పించాలని, జాయింట్ కలెక్టర్ అటవీ భూములను పరిశీలించి వర్గీకరణ మార్పులు చేసి అర్హులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సమస్యలపై కూడా నేతలు ప్రస్తావించారు. కొణిజర్ల–గుళ్లపూడి మధ్య తమ్మిలేరు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లోపూడి నుంచి గుళ్లపూడి మీదుగా ఆర్అండ్బీ రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని కోరారు. పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహాయం అందించాలని, చేతినిండా పని కల్పించి తగిన కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మల్లెపాము భవాని, పామర్తి రామారావు, పామర్తి రాజేశ్వరి, గోళ్ల కొండయ్య, చిట్టిమాద సీతారామయ్య, ఊరకరణం శంకర్, బృందావనం శ్రీనివాసరావు, బేతపూడి ఏసు తదితరులతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.