మలక్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం..
బస్సు చక్రాల కింద పడి యువతి మృతి
హైదరాబాద్: మలక్‌పేటలోని డీమార్ట్ సిగ్నల్ ఎదురుగా శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి స్కిడ్ కావడంతో రోడ్డుపై పడిపోయిన 25 ఏళ్ల బి. లావణ్య బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లావణ్య తన భర్త నడుపుతున్న ద్విచక్రవాహనంపై ఎల్బీనగర్ నుంచి చాదర్‌ఘాట్ వైపు ప్రయాణిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సుమారు 3:50 గంటల సమయంలో మలక్‌పేట డీమార్ట్ సిగ్నల్ సమీపంలో వాహనం అదుపుతప్పి స్కిడ్ కావడంతో భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై పడిపోయారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న బస్సు వెనుక చక్రాల కింద లావణ్య పడటంతో తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఘటనపై చాదర్‌ఘాట్ పోలీసులు తదుపరి వివరాలు పరిశీలిస్తున్నారు.