చిన్నంపేటలో సేవా సంకల్ప్ అభియాన్ ఉచిత వైద్య శిబిరం
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన మాసోత్సవాల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వైద్యాధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ శిబిరంలో మధుమేహం, రక్తపోటు పరీక్షలతో పాటు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. అత్యవసర వైద్య పరీక్షలు, మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఏరియా ఆసుపత్రికి పంపించి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కందుకూరి అప్పారావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ఠ పెరిగిందని పేర్కొన్నారు. దేశం మరింత అభివృద్ధి సాధించాలని, నరేంద్ర మోదీ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చిన్న నాగమల్లేశ్వరరావు, చింత వెంకటేశ్వరరావు, మిత్రుల వెంకటేశ్వరరావు, తెల్దూరి ప్రసాద్, శ్రీధర్ తదితరులతో పాటు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది ఎంపీహెచ్‌ఈఓ శ్రీధర్, ఎంఎల్‌హెచ్‌పీ రజనీ, హెచ్‌ఏఎస్ ప్రభాకర్, దార్ల సురేష్‌బాబు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, 104 సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.