కరీంనగర్‌లో వైభవంగా శ్రీ గణపతి హోమం
కరీంనగర్ పట్టణంలోని భాగ్యనగర్‌లో కొలువుదీరిన శ్రీ గణపతి పందిరి వద్ద పదో రోజు బుధవారం శ్రీ గణపతి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితుడు చౌటి రాజేష్ శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ, అనంతరం నవగ్రహ పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
హోమంలో భాగంగా “ఓం గం గణపతయే నమః” అనే గణపతి మూల మంత్రాన్ని పఠిస్తూ, ప్రతి మంత్రోచ్ఛారణ అనంతరం “స్వాహా” అంటూ ఆవు నెయ్యి, వివిధ రకాల హోమ ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో 16 మంది దంపతులు పీటలపై కూర్చుని హోమ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హోమం అనంతరం గణపతి కమిటీ సభ్యులు భక్తులకు వివిధ రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. గణపతి నిర్వహణ కమిటీ సభ్యులు వి. మల్లేశం, వి. మురళీ, ఎం. ప్రవీణ్ రెడ్డి, వి. సునీల్ రెడ్డి, సిహెచ్. వెంకటేశ్వరరావు, ఎస్. కిషన్ రెడ్డి తదితరులు కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు.