తిరువూరులో రాష్ట్రస్థాయి బెంచ్‌ప్రెస్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం
క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఏసీపీ రామచంద్రరావు.. డ్రగ్స్ నివారణ, మహిళల భద్రతపై అవగాహన
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రాష్ట్రస్థాయి బెంచ్‌ప్రెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో వి. కన్వెన్షన్ హాల్ సందడిగా మారింది. నాగుబండి రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్, పవర్‌లిఫ్టింగ్ ఇండియా అనుబంధంతో ఎన్టీఆర్ జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహణలో 13వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ పురుషులు, మహిళల క్లాసిక్, ఎక్విప్డ్ బెంచ్‌ప్రెస్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలను ఏసీపీ పి. రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఏసీపీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఓటములకు నిరాశ చెందకుండా నిరంతర సాధనతో ముందుకు సాగాలని, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ప్రాంతానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
క్రీడా పోటీల వేదికగా పోలీస్ శాఖ చేపడుతున్న ఆపరేషన్ త్రిశూల్‌పై కూడా ఏసీపీ అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వేధింపుల నివారణకు సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగాన్ని నివారించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం, మహిళల భద్రత, ప్రమాద రహిత ప్రయాణం లక్ష్యంగా పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలని కోరారు.
పలు విభాగాల్లో పోటీలు
ఈ ఛాంపియన్‌షిప్‌లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా క్లాసిక్, ఎక్విప్డ్ బెంచ్‌ప్రెస్ పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. మహిళా క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పవర్‌లిఫ్టింగ్ గౌరవ అధ్యక్షుడు నాగుబండి విశ్వేశ్వరరావు సహకారంతో పోటీల నిర్వహణ కొనసాగుతోంది.
క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు యువతలో సామాజిక బాధ్యత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేలా ఈ కార్యక్రమం సాగుతోంది.