జూరాల నీటి విడుదలపై కర్ణాటకతో చర్చలకు మంత్రుల బృందం
హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల అంశంపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బెంగళూరుకు వెళ్లనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జూరాల నీటి విడుదలపై కర్ణాటక ప్రభుత్వంతో జరపాల్సిన సంప్రదింపులపై ముఖ్యమంత్రితో చర్చించారు.
ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మంత్రుల బృందం చర్చించనుంది. జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటి అవసరాలు, నీటి లభ్యత, ఎగువ నుంచి వచ్చే ప్రవాహం తదితర అంశాలను కర్ణాటక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
మంగళవారం సాయంత్రం మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రితో సమావేశం కానుంది.