ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి
ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి దేశవ్యాప్త ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని వామపక్ష, కాంగ్రెస్ పార్టీల డిమాండ్
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపడుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆర్‌ఆర్ పేట గంగానమ్మ గుడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన ఎన్నికల సంఘం, పూర్వీకుల ఓటరు వివరాలను ప్రామాణికంగా తీసుకునే విధానం అవలంబించడం సరికాదని విమర్శించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హుల ఓటు హక్కుకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు బద్దా వెంకటరావు మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని, ఇప్పటికే తొలగించిన అర్హుల పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల సవరణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరుపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్. డాంగే, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు, భజంత్రీ శ్రీనివాస్, ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, పలువురు వామపక్ష, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.