ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యం
శ్రీరాములపల్లిలో పర్యటించిన పొన్నం ప్రభాకర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శ్రీరాములపల్లి: గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ప్రజల వద్దకే వెళ్లి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా “పల్లె పల్లెకు పొన్నమన్న – పల్లె పల్లెలో ప్రజాపాలన” కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
శ్రీరాములపల్లి గ్రామంలో ఆయన పర్యటించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీరు, వాటర్ ప్లాంట్, గ్రామపంచాయతీ భవనం, వీఓ భవనం తదితర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గౌరవెల్లి ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేసి, త్వరలోనే సాగునీరు అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఎంన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.26 లక్షల విలువైన అంతర్గత సీసీ రోడ్లు, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు, పోషకాహారం అందించడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలన కొనసాగించడమే “పల్లె పల్లెకు పొన్నమన్న – పల్లె పల్లెలో ప్రజాపాలన” కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు.