తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
సోలార్ ప్లాంట్ వద్ద కనిపించినట్లు స్థానికుల సమాచారం.. అప్రమత్తంగా ఉండాలని సూచన
పాణ్యం: నంద్యాల జిల్లా పాణ్యం మండలం తామరాజుపల్లి గ్రామ పరిధిలోని కొండల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం వెలువడటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. కొండపై ఉన్న శివాలయం సమీపంలో పులి కనిపించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
బుధవారం రాత్రి సోలార్ ప్లాంట్ వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పులిని గమనించి తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసినట్లు సమాచారం. అయితే ఈ ప్రాంతంలో పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
కొండ ప్రాంతాల్లో మేకలను మేపేందుకు వెళ్లేవారు, సోలార్ ప్లాంట్‌లో విధులు నిర్వహించే సిబ్బంది, ఇతర పనుల నిమిత్తం కొండలపైకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పులి సంచారం ఉన్నట్లు సమాచారం నేపథ్యంలో అత్యవసరం కాని పనుల కోసం కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.
పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లడం, ఫొటోలు లేదా వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం చేయకూడదని సూచిస్తున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
అటవీ శాఖ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి పులి సంచారంపై స్పష్టత ఇవ్వడంతో పాటు ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.