విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వన్‌టౌన్‌లో ‘త్రిశూల వ్యూహం’లో భాగంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐలు, సిబ్బందితో పాటు వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. వి.జి. చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వన్‌టౌన్‌లోని రమణయ్య కూల్‌డ్రింక్ షాప్ వద్ద ముగిసింది. అనంతరం ‘త్రిశూల వ్యూహం’ ఉద్దేశాలు, లక్ష్యాలపై ఇన్‌స్పెక్టర్ కొండలరావు అవగాహన కల్పించారు.
‘త్రిశూల వ్యూహం’లో ప్రధానంగా డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు భద్రత అనే మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కొండలరావు మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించే వారికి నిబంధనల ప్రకారం పారితోషికం అందజేస్తామని తెలిపారు.
మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో వ్యవహరించాలని, మహిళల భద్రత విషయంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
రోడ్డు భద్రతపై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండటం, మహిళల భద్రతకు సహకరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఇన్‌స్పెక్టర్ కొండలరావు పిలుపునిచ్చారు.