15 రోజులుగా వీఆర్ఏల దీక్ష..
ఆంధ్రప్రదేశ్
15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం
చౌడేపల్లి, సెప్టెంబర్ 30: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలానికి చెందిన వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతోంది. వీఆర్ఏల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేపడుతున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.
గత 15 రోజులుగా కొనసాగుతున్న నిరసనలో భాగంగా తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వీఆర్ఏల యూనియన్ తరఫున అందజేసినట్లు పేర్కొన్నారు.
వీఆర్ఏలకు తక్షణమే వేతన స్కేలు అమలు చేయాలని, ప్రస్తుతం వీఆర్ఏల స్థానాల్లో పనిచేస్తున్న నామినీలను నిబంధనల ప్రకారం వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు రికార్డు అసిస్టెంట్, అటెండర్ తదితర పోస్టుల్లో నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు.
అలాగే కారుణ్య నియామకాల ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాత్రిపూట కూడా తహసీల్దార్ కార్యాలయం వద్ద కాపలా విధులు నిర్వహిస్తూ నిరసన కొనసాగిస్తున్నామని సంఘ ప్రతినిధులు తెలిపారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సుమంత్, రెడ్డి రత్నాలు, భాస్కర, రాజన్న, సావిత్రి, రెడ్డి రాజా, గంగులప్ప, రెడ్డప్ప, నరేష్‌తో పాటు పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.