సూర్యలంక బీచ్‌లో అలల బీభత్సం.. ఐదుగురిని కాపాడిన మత్స్యకారులు
బాపట్ల జిల్లా: సూర్యలంక బీచ్‌లో సముద్రపు అలలు ఒక్కసారిగా ఉధృతం కావడంతో సముద్రంలో స్నానానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. అప్రమత్తమైన మత్స్యకారులు వంశీ, కనకరాజు ధైర్యసాహసాలతో వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.
గుంటూరు నగరంలోని నల్లచెరువుకు చెందిన యువకులు బాపట్ల మండలం సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఇద్దరు యువకులు నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన మత్స్యకారులు వంశీ, కనకరాజు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అదే సమయంలో అలల్లో చిక్కుకుని కొట్టుకుపోతున్న మరో ముగ్గురిని కూడా తమ ప్రాణాలను లెక్కచేయకుండా కాపాడారు.
ఈ ఘటనలో ఒక వ్యక్తి సముద్రపు నీటిని అధికంగా తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన మత్స్యకారులు, స్థానికుల సహకారంతో ఐదుగురు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.
సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నప్పుడు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, లోతైన ప్రాంతాల్లోకి వెళ్లి స్నానాలు చేయవద్దని సూచిస్తున్నారు.