దారి వివాదంలో మహిళపై ట్రాక్టర్‌తో దాడి.. నిందితుడికి ఐదేళ్ల జైలు
దారి వివాదంలో మహిళపై ట్రాక్టర్‌తో దాడి.. నిందితుడికి ఐదేళ్ల జైలు
రూ.20 వేల జరిమానా విధించిన మదనపల్లె ఏడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు
మదనపల్లె: దారి, ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో మహిళపై ట్రాక్టర్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏడో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్. శ్రీలత గురువారం ఈ తీర్పు వెలువరించారు. పోలీసుల దర్యాప్తు, వైద్య ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై నేరం రుజువైంది.
దారి, ఇంటి స్థలం విషయంలో వివాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌడేపల్లి మండలం దిగువపల్లె పంచాయతీ పరిధిలోని కొలింపల్లె గ్రామానికి చెందిన పాశం నాగరాజు (45)కు అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో ఇంటి స్థలం, రహదారి విషయంలో వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి భార్య యనమల సావిత్రమ్మపై నాగరాజు ట్రాక్టర్‌తో దూసుకెళ్లినట్లు కేసు నమోదైంది.
ఈ ఘటనలో ట్రాక్టర్ సావిత్రమ్మ ఎడమ కాలు, ఛాతీ భాగాలపై నుంచి వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పలు ఎముకలు విరిగినట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎం.జి. రాజ్ కిషోర్ మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతిలోని ఎస్వీఆర్‌ఆర్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందిన ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
పక్కా ఆధారాలతో నేరం రుజువు
ఈ ఘటనపై అప్పటి చౌడేపల్లి ఎస్ఐ జి. రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ నంబర్ 153/2023 కింద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కేసుగా నమోదు చేసి, సాక్షుల వాంగ్మూలాలు సేకరించారు. వైద్య ధ్రువీకరణ పత్రాలు, ఘటనకు ఉపయోగించిన ట్రాక్టర్, ట్రైలర్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత ఆధారాలను న్యాయస్థానంలో సమర్పించారు.
పోలీస్ కోర్టు మానిటరింగ్ వ్యవస్థ ద్వారా కేసు విచారణ పురోగతిని పోలీసులు పర్యవేక్షించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. గణపతి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. పోలీసుల సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు పాశం నాగరాజును దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది.
పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
కేసులో నేరం రుజువయ్యేలా దర్యాప్తు చేసిన అప్పటి ఎస్ఐ జి. రవికుమార్, కోర్టు విచారణ సమన్వయంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత చౌడేపల్లి ఎస్ఐ జి. చిన్న రెడ్డప్పను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అభినందించారు. అలాగే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. గణపతి, కోర్టు లైజన్ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ జి. సతీష్ కుమార్, కోర్టు కానిస్టేబుల్ కె. నాగరాజును ప్రశంసించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడిన వారిపై సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానంలో నేరం రుజువయ్యేలా పోలీసులు కృషి చేస్తారని తెలిపారు.