పిడుగురాళ్లలో మహిళ హత్య.. వివాహేతర సంబంధమే కారణమని సీఐ వెల్లడి
పిడుగురాళ్ల, అక్టోబర్ 8: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో ఎక్కుతున్న సమయంలో మహిళపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తమ్మిశెట్టి సుజాత మృతి చెందగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన దేవళ్ల పార్వతమ్మపై కూడా దాడి జరిగినట్లు వెల్లడించారు.
ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, సుజాత హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన సుజాతకు, సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బత్తుల గోవిందుకు మధ్య ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
హత్యకు దారితీసిన పరిస్థితులు, దాడికి పాల్పడిన వ్యక్తి పాత్రపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.