మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
కనిగిరిలో నషా ముక్త్ యువ భారత్ అవగాహన కార్యక్రమం
కనిగిరి: యువత ఉజ్వల భవిష్యత్తు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రధానమంత్రి ప్రారంభించిన నషా ముక్త్ యువ భారత్ అభియాన్ 100 వారాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పదో ఆదివారం కనిగిరి పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పారా లీగల్ వాలంటీర్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా విద్య, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలు, సామాజిక సేవ వంటి సానుకూల కార్యక్రమాలపై దృష్టి సారించాలని యువతకు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వాటి దుష్ప్రభావాలపై స్నేహితులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు.
అనంతరం యువతతో నషా ముక్త్ యువ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యువతతో పాటు గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.