భారీ వర్షాల నేపథ్యంలో 12 కుటుంబాల తరలింపు
గంపలగూడెం మండలం పెద్దకొమిరలో పునరావాస కేంద్రం ఏర్పాటు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెద్దకొమిర గ్రామంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కట్టలేరు వాగు పరిధిలోని ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న 12 కుటుంబాలకు చెందిన 38 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పెద్దకొమిర గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్‌లో ప్రత్యేకంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించారు. తరలించిన వారిలో 14 మంది పురుషులు, 19 మంది మహిళలు, ఒక గర్భిణి, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాలు, వాగులో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పునరావాస కేంద్రం అందుబాటులోనే ఉంటుందని అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు లేదా సురక్షిత ప్రాంతానికి తరలింపు అవసరమైన బాధితులు వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ నంబర్: 8499899928