చింతలపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్రైనేజీ సమస్యతో 300 కుటుంబాల అవస్థలు
వర్షపు నీటితో ముంపు భయం..
తవ్వేసిన సిమెంట్ రోడ్లు.. అంబులెన్స్ సైతం వెళ్లలేని దుస్థితి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆగ్రహం చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో డ్రైనేజీ సమస్య కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో వర్షపు నీరు సజావుగా బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాల సమయంలో సిమెంట్ రోడ్ల కింద సరైన నీటి ప్రవాహ మార్గాలు ఏర్పాటు చేయకపోవడం, ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్మాణ పనులు చేపట్టడం వల్ల వర్షపు నీరు పెద్దఎత్తున కాలనీలోకి చేరింది. దీంతో ఇళ్ల చుట్టూ నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు నీటి ప్రవాహం కోసం కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లను సైతం పగలగొట్టి తూములు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రోడ్లను ధ్వంసం చేసిన అనంతరం తిరిగి మరమ్మతులు చేపట్టకపోవడం, కనీసం సిమెంట్ కూడా అందుబాటులో ఉంచకపోవడంతో రహదారులు అధ్వానంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో సమస్య మరింత తీవ్రమైంది. నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేసిన తూములను తొలగించడం, పలుచోట్ల రోడ్లను తవ్వేయడంతో కాలనీలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్న కాలనీకి డ్రైనేజీ పనులు చేపట్టే ముందు సరైన ప్రణాళిక ఎందుకు రూపొందించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వర్షపు నీరు సజావుగా బయటకు వెళ్లేందుకు శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన కొత్త సిమెంట్ రోడ్లను పగలగొట్టి మరమ్మతులు చేయకుండా వదిలేయడానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రోడ్లు తవ్వేసిన పరిస్థితుల్లో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం కాలనీలోకి చేరుకోలేని పరిస్థితి ఏర్పడితే బాధ్యత ఎవరు వహిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మున్సిపల్ అధికారులు సమస్యపై పూర్తిస్థాయిలో స్పందించడం లేదని, మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం కాలనీవాసుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారుల, ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్ కాలనీని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని కాలనీవాసులు కోరుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ధ్వంసమైన సిమెంట్ రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సమగ్ర ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే వర్షపు నీటి ముంపుతో ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే చర్యలు చేపట్టి 300 కుటుంబాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.