4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్
పార్లమెంట్‌లో రద్దు ప్రకటన చేయాలి: సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం. శ్రావణ్ కుమార్
సంతోష్‌నగర్ చౌరస్తాలో కార్మికుల రాస్తారోకో.. నిలిచిపోయిన వాహనాలు
సీఐటీయూ నేతలు, కార్మికుల అరెస్ట్
హైదరాబాద్: NTODAY NEWS
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు, దిగుమతుల సరళీకరణ బిల్లు తదితర ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించాలని సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం. శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.
కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తొలగించి, వాటి స్థానంలో బడా కంపెనీల యజమానులకు అనుకూలంగా కొత్త చట్టాలను తీసుకురావడం కార్మికుల హక్కులను హరించడమేనని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళనలు ప్రభుత్వానికి హెచ్చరికగా భావించాలని అన్నారు.
సంతోష్‌నగర్‌లో రాస్తారోకో
పై డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక, ఇతర కార్మిక సంఘాలు జైల్ భరో ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, హైదరాబాద్‌లోనూ కార్మికులు నిరసనకు దిగారు.
దీనిలో భాగంగా సోమవారం సంతోష్‌నగర్ చౌరస్తాలో వందలాది మంది కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును రద్దు చేయాలని నినాదాలు చేశారు.
కార్మికుల నినాదాలతో సంతోష్‌నగర్ చౌరస్తా మార్మోగింది. రాస్తారోకో కారణంగా సుమారు అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. రహదారిపై నిలిచిపోయిన వాహనదారులు సైతం ఆందోళనకు స్వచ్ఛందంగా సహకరించారని నిర్వాహకులు తెలిపారు.
ఆందోళనకారుల అరెస్ట్
రాస్తారోకో నేపథ్యంలో స్థానిక ఈఎస్ సదన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. నాగరాజు, ఎస్‌ఐ సింధూజ ఆధ్వర్యంలోని పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
ఈ కార్యక్రమానికి ఐద్వా, ఆవాజ్, గిరిజన, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు శశికళ, అబ్దుల్ సత్తార్, రాంకుమార్, ఏ. కృష్ణ, బి. నిఖిల్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ ఆందోళనలో సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు మీనా, ఎల్. కోటయ్య, ఎస్. కిషన్, ఏ. కృష్ణ, సీహెచ్. నరసింహ, పి. నాగేశ్వర్, సోమన్న, వీరన్న, నసీరుద్దీన్, ఎం. వెంకటేష్, బి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.