ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
కొత్తపేట: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. బుధవారం మండలంలోని ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
సాస్కి నిధుల నుంచి రూ.1.25 కోట్లతో చేపట్టనున్న రెండు రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అలాగే జలజీవన్ మిషన్ కింద రూ.45.50 లక్షలతో నిర్మించనున్న మైక్రో ఫిల్టర్ సంపు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పల్లెల్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.