వేలేరు చెక్‌పోస్టు వద్ద 40 లీటర్ల నాటుసారా పట్టివేత
కుకునూరు, అక్టోబర్ 4: ఏలూరు జిల్లా కుకునూరు మండలం వేలేరు గ్రామ శివారులోని చెక్‌పోస్టు వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నాటుసారా తరలిస్తున్న రెండు వాహనాలను సైతం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ కె. నాగ ప్రభు కుమార్ ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి.హెచ్. అజయ్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున ఈ తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోని బూర్గంపహాడ్ నుంచి వస్తున్న ఆటో (TG 28 T 0431), ద్విచక్ర వాహనం (TG 28 A 0274)లో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను అధికారులు గుర్తించి పట్టుకున్నారు.
ఈ ఘటనలో వేలేరుకు చెందిన భూక్యా బాలు, బోడ నరసింహలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీను బాబు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ వై. ఫణి కుమార్‌తో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం, నాటుసారా రవాణాపై నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.