5000 కనెక్షన్లు.. ఒక్క జూనియర్ లైన్‌మ్యాన్..
5000 కనెక్షన్లు.. ఒక్క జూనియర్ లైన్‌మ్యాన్.. ప్రగడవరంలో విద్యుత్ సమస్యలపై ఆందోళన
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరం పంచాయతీలో విద్యుత్ సరఫరా నిర్వహణపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేజర్ పంచాయతీగా ఉన్న ప్రగడవరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు శాశ్వత లైన్‌మ్యాన్ లేకపోవడం, లైన్ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో విద్యుత్ సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
పంచాయతీ పరిధిలో సుమారు 5 వేలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ బాధ్యతలను ఒకే జూనియర్ లైన్‌మ్యాన్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు సమస్య ఎక్కడ తలెత్తిందో గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు తగిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు.
బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి సుమారు 10 సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయి తిరిగి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నప్పటికీ అసలు సమస్యకు కారణం ఏమిటో గుర్తించేందుకు అవసరమైన సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రగడవరం మాత్రమే కాకుండా చింతలపూడి మండలంలోని పలు గ్రామాల్లోనూ విద్యుత్ లైన్‌మ్యాన్‌లు, సాంకేతిక సిబ్బంది కొరత ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వ్యవసాయ, గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అనే విషయాన్ని జిల్లా, మండల స్థాయి విద్యుత్ అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
విద్యుత్ సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో ప్రగడవరం ప్రాంతంలోని కొందరు ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన ఘటనను కూడా వారు గుర్తుచేస్తున్నారు. పరిస్థితి మరింత తీవ్రమై గ్రామస్థులు పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చే వరకు అధికారులు స్పందించాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.
అదేవిధంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు, విద్యుత్ సరఫరాలో సుదీర్ఘ అంతరాయాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నందున రాత్రి వేళల్లో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రగడవరం వంటి మేజర్ పంచాయతీలో వేలాది విద్యుత్ కనెక్షన్లకు సరిపడా సిబ్బందిని నియమించడంతో పాటు ఖాళీగా ఉన్న లైన్ ఇన్‌స్పెక్టర్ పోస్టును భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడటానికి గల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని, గ్రామాల వారీగా సిబ్బంది కొరతను సమీక్షించి అవసరమైన మేరకు లైన్‌మ్యాన్‌లు, ఇతర సాంకేతిక సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.