పోషకాహారంతోనే పిల్లల ఉజ్వల భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
మునగపాక: మండలంలోని పాటిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసం–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఎస్.కే.ఎన్. మీరాభి, కే. అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాజ భాగస్వామ్యం, జవాబుదారీతనంపై అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కేంద్రం మానిటరింగ్ కమిటీ సభ్యులు కేంద్రంలో వండే ఆహారం నాణ్యత, రుచిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూపర్‌వైజర్లు సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆహారంలో చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పసుపు రంగు పండ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
పిల్లల్లో పోషకాహార లోపాన్ని ముందుగానే గుర్తించేందుకు ప్రతి నెలా బరువు తూయించాలని సూచించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించిన అనంతరం అవసరమైన అదనపు ఆహారం అందించడంతో పాటు వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంత ముఖ్యమో, తల్లిదండ్రుల ప్రేమతో కూడిన సంరక్షణ, చిన్న వయస్సు నుంచే సరైన అలవాట్లు కల్పించడం కూడా అంతే ముఖ్యమని వివరించారు. పిల్లలకు బయట లభించే ఆహార పదార్థాలను అలవాటు చేయకుండా, ఇంట్లోనే పరిశుభ్రంగా తయారు చేసిన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు.
చిరుధాన్యాలతో వివిధ రకాల పోషకాహార పదార్థాలను ఎలా తయారు చేసుకోవచ్చో కార్యక్రమంలో వివరించారు. అలాగే ECCE కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను పిల్లలకు ఏ విధంగా అందిస్తున్నారో అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవల్లో సమాజ భాగస్వామ్యం కీలకమని సూపర్‌వైజర్లు తెలిపారు.
జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా బాలల సంరక్షణ విభాగం క్షేత్రస్థాయి సామాజిక కార్యకర్త ప్రత్యేక శిశు దత్తతపై అవగాహన కల్పించారు. అనాథ, వదిలివేయబడిన లేదా అప్పగించబడిన పిల్లలు ఎవరైనా గుర్తిస్తే సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచించారు.
చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సేవలు, కౌన్సెలింగ్ తదితర అంశాలపై సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రజ్వల సంస్థ అందిస్తున్న సేవల గురించి గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ టీచర్లకు వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.