అభివృద్ధిపై చర్చకు రండి.. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్
అభివృద్ధిపై చర్చకు రండి.. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్
- లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం
- 'సర్' నమోదులో వేగం పెంచాలని కొక్కిరాల సురేఖ పిలుపు
లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్స్ లో శనివారం లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. గడిచిన 70 ఏళ్లలో జరగని అభివృద్ధి నేడు మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతోందని, దమ్ముంటే ప్రతిపక్షాలు అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. దండేపల్లి మండలంలోనే రూ.500 కోట్లతో పనులు జరుగుతున్నాయని, రైతుల కోసం 4 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మంచిర్యాల ప్రజల కోసం కరకట్ట, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళా ఐకేపీ సంఘాలకు వడ్ల కొనుగోలు బాధ్యతలు అప్పగించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచామన్నారు. అంతకుముందు, నూతన చైర్మన్‌గా అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా చాతరాజు రాజేష్‌లతో పాటు డైరెక్టర్లతో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి షాబొద్దిన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని నూతన చైర్మన్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండి, ప్రత్యామ్నాయంగా పెసర్లు, కంది వంటి ఇతర పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ముందు చూపుతో ప్రభుత్వ సూచనలు పాటించి నష్టాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకులు తమ జేబుల్లోంచి నిధులు ఇవ్వడం లేదని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన నిధులే వస్తున్నాయని స్పష్టం చేశారు. నాడు రైతుల ధర్నాలు, నేడు యువత తిరుగుబాటుతో మోడీ ప్రభుత్వం ఎలా తోక ముడిచిందో ప్రజలు చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
'సర్' నమోదు ప్రక్రియలో మంచిర్యాల నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, మిగిలిన కొద్ది రోజుల్లో నాయకులు, కార్యకర్తలు యుద్ధ ప్రాతిపదికన రాత్రింబవళ్లు పనిచేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం ఎమ్మెల్యే దంపతులను నాగలి కర్రు బహుకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షేట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగభూషణం, పూర్ణ చందర్ రావు, త్రిమూర్తులు, పింగళి రమేష్, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు రామగిరి బానేష్, పలు గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు