ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి
పెండింగ్ దరఖాస్తులను పునఃపరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
నడిగూడెం | Ntoday News
నడిగూడెం మండలంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు పలు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్సూర్ నాయక్‌తో పాటు వివిధ శాఖల అధికారులకు వినతిపత్రం అందజేశారు.
మండల వ్యాప్తంగా అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ, పేద ప్రజలందరికీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఇప్పటికే వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పునఃపరిశీలించి, అర్హులైన వారికి సత్వరమే పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు సంబంధించిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్‌ఎస్ నాయకుల విజ్ఞప్తిపై ఎంపీడీవో మల్సూర్ నాయక్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి త్వరితగతిన ప్రజా సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు గార్లపాటి శ్రీనివాసరెడ్డి, నీలకంఠం వెంకన్న, పోలంపల్లి వెంకటేశ్వర్లు, జలీల్, నాగేశ్వరరావు, విజయ్, బోనగిరి ఉపేందర్, వీరాంజనేయులు, దోసపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.