ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం.......
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం.......
తేదీ: 07-09-2026: సోమవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయివ రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రదీపనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య పిల్లలమర్రి రాములు, అధ్యక్షులు, తెలుగుశాఖ, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు విచ్చేసి శేరిలింగంపల్లి మండల పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, గురుకుల కళాశాలల మరియు జవహర్ నవోదయ విద్యాలయం, యూనివర్సిటీ ఆచార్యులు, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత మరియు ప్రాథమిక పాఠశాలలలో పనిచేస్తున్న 35 మంది అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను (శాలువ, జ్ఞాపిక, పగిడి, తాంబూలాలు) వేదమంత్రాల నడుమ సాంప్రదాయ బద్దంగా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం బిల్డర్ మరియు సోషల్ వర్కర్ అయిన తూనిక రాఘవేంద్రరావు మరియు U. V. రమణమూర్తి వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. తదనంతరం ఆచార్య పిల్లలమర్రి రాములుగారు మాట్లాడుతూ ఈ సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి అధ్యాపక వృత్తి అని అన్నారు. అందుకే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాతి స్థానం గురువుదే అని పేర్కొన్నారు. గురువు తన శిష్యులలో చీకటి అనే అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞానమనే జ్యోతిని వెలిగించి వారి ఉజ్వల భవిష్యత్తుకై నిరంతరం శ్రమిస్తుంటారు. మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే ముఖ్యం అని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో పయనించడానికి, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడటానికి విద్యయే ప్రధాన కారణం. ఈనాడు సమాజంలో వివిధ రంగాలలో ఉన్న ప్రముఖులందరూ కూడా గురువు అడుగుజాడలలో నడిచిన వారే. కేవలం పాఠ్య పుస్తకాలలోని పాఠాలే కాకుండా క్రమశిక్షణ, మానవతా, నైతిక విలువలు పెంపొందించడం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పాటు పడతాడు గురువు. ప్రతి సంవత్సరం మన దేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. సెప్టెంబరు 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. రాధాకృష్ణన్ రాజకీయ వేత్త, తత్వవేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు, రచయిత మరియు విద్యావేత్త అని కొనియాడారు. రాధాకృష్ణన్ ఈ సమాజానికి ఉపన్యాసకుడిగా, ఆచార్యునిగా, ఉప కులపతిగా, ఆక్స్ ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలలో తత్వశాస్త్ర బోధకునిగా, రష్యాలో భారత రాయబారిగా, రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా, UNESCO అధ్యక్షునిగా, UEC ఛైర్మన్ గా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా యీ సమాజానికి విశేషమైన సేవలు అందించినందుకుగాను ఆయనను భారతరత్న మరియు బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ వంటి అవార్డులు వరించాయి అని తెలిపారు. ఆయన భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారని ప్రతీతి. ఆయన గౌరవార్థం ఆయన జన్మదినమైన సెప్టెంబరు 5న భారత ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది అని తెలిపారు.
నేటి యువ అధ్యాపకులు రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నూతన విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులను క్షుణ్ణంగా అధ్యాయనం చేసి, ఆకళింపు చేసుకొని, సమాజంలో క్షేత్రస్థాయిలో వస్తున్న మార్పులను నిశితంగా గమనిస్తూ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని భావి భారత పౌరులు కాబోయే విద్యార్థిని, విద్యార్థులకు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే సామాజిక బాధ్యత అధ్యాపకులదే. భారతీయ సనాతన విధానంలో గురుశిష్య బంధంలోని నైతికతను పరంపరాగతంగా కాపాడుకుంటూ రావాలి అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్రరెడ్డిగారు, మండల విద్యాధికారి వెంకటయ్య గారు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బసవలింగం, అధ్యాపకులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, ఉమా చంద్రశేఖర్, G.V. రావు, బాలన్న, సుజాత, వీణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.